విజిట్ వీసాకు 500 రోజులు!

అమెరికా సందర్శించేందుకు విజిట్ వీసా కోసం ఎదురు చూసే సమయం గణనీయంగా పెరుగుతోంది. బ్యాక్‌లాగ్ అప్లికేషన్లను క్లియర్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎదురు చూసే సమయం పెరగుతూనే ఉంది. కోల్‌కతాలో అమెరికా బీ1, బీ2 వీసా అప్లికేషన్ల ఎదురు చూసే సమయం 500 రోజులుగా ఉంది. చెన్నయ్‌లోని అమెరికా కాన్సులేట్‌లో విజిట్ వీసా పొందలాంటే 486 రోజులు ఆగాల్సిందే. ముంబైలో ఇది 472 రోజులు, న్యూఢిల్లీలో ఇది 432 రోజులగా ఉంది. హైదరాబాద్‌లో విజిటింగ్ వీసా పొందాలంటే 435 రోజులు వేచి ఉండాల్సిందే. ఇంత సుదీర్ఘ కాలం ప్రాసెసింగ్‌కు తీసుకోవడం పట్ల దరఖాస్తుదారుల్లో ఆందోళన పెరుగుతోంది. నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం వేచి ఉండే సమయం సిబ్బందిపై పని భారం, సిబ్బంది లభ్యత ఆధారంగా హెచ్చుతగ్గులకు గురవుతుందని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ అధికారులు తెలిపారు. బీ1 వీసాలు బిజినెస్ ట్రావెల్ కోసం ఉద్దేశించినవి, బీ2 వీసాలు టూరిజం, ఫ్రండ్స్, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు, మెడికల్ ట్రిట్‌మెంట్ కోసం తీసుకునే విజిటింగ్ వీసా, సాధారణంగా బీ1, బీ2 వీసాలకు కలిపే జారీ చేస్తుంటారు.వీసా తీసుకున్న వారు అమెరికాలో ఉన్న సమయంలో వ్యాపార కార్యకలాపాలతో పాటు, పర్యాటక ప్రాంతాలను సందర్శించడం, కుటుంబ పరమైన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.