Padma Bhushan: నోరి దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను 2026 ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర-సాంకేతికం, వాణిజ్యం-పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం- విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులు వరించాయి. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
బాలీవుడ్ కు విశేష సేవలందించిన సినీ నటుడు ధర్మేంద్రకు (కళలు) మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. కె.టి.థామస్ (సామాజిక సేవ), ఎన్.రాజన్ (కళలు), పి.నారాయణన్ (సాహిత్యం) వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం) (సామాజిక సేవ)లకు కూడా పద్మ విభూషణ్ అవార్డులకు దక్కాయి. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని పద్మ భూషణ్ వరించింది.
అమెరికాలోని మెమోరియల్ స్లోన్ క్యాటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగంలో హెడ్ గా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పనిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసిన ఆయన మహిళల్లో క్యాన్సర్ చికిత్సలో నిపుణుడిగా పేరు పొందారు. అలాగే, బసవతారకం ఆసుపత్రి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 50 ఏళ్ల పాటు క్యాన్సర్ చికిత్స సేవలకు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నుంచి ‘ట్రిబ్యూట్ టు లైఫ’ గౌరవం అందుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. ఇప్పుడు ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనున్నది.






