Aadabidda Nidhi: బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి చోటు? మహిళల్లో పెరుగుతున్న ఆశలు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సంక్షేమ పథకాల అమలుపై మరింత దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో “సూపర్ సిక్స్” (Super six) హామీలతో ప్రజల ముందుకు వెళ్లిన కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం (Free RTC Bus Travel), ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు మహిళలకు ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తున్నాయి. అయితే ఈ హామీల్లో కీలకమైన ఆడబిడ్డ నిధి పథకం (Aadabidda Nidhi Scheme) అమలుపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో విమర్శలు పెరిగాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ పథకం ఆలస్యం అవుతోందని ప్రభుత్వం ఇప్పటివరకు వివరణ ఇచ్చింది. అయినా కూడా ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడం, లబ్ధిదారులైన మహిళల్లో ఆశలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈ మొత్తాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడనుంది. అయినా రాజకీయంగా, సామాజికంగా ఈ పథకం ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో అమలు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికలు ముగిసి దాదాపు 20 నెలలు గడవడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జరగనుండటం కూడా ప్రభుత్వ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఆడబిడ్డ నిధిని ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నతస్థాయి చర్చలు జరిగాయని ప్రచారం. నెలనెలా నగదు జమ చేయాలా? లేక సంవత్సరానికి ఒకసారి మొత్తంగా ఇవ్వాలా? అనే అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలు, అర్హతలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) ఈ విషయంలో కీలకంగా మారనున్నాయి. ఫిబ్రవరి 14న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ (Annual Budget) ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక బడ్జెట్తో పాటు వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలకు ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ, ఉపాధి కల్పన వంటి హామీల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తోందని మంత్రులు చెబుతున్నారు. ఆడబిడ్డ నిధిపై బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయనే నమ్మకం ప్రజల్లో పెరుగుతోంది. అయితే కేటాయింపులు చేసినా, వాస్తవంగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నదే ఇప్పుడు ప్రధాన ఉత్కంఠ. బడ్జెట్ ప్రకటనతో ఈ సందేహాలకు తెరపడుతుందా? లేదంటే మరోసారి ఎదురుచూపులేనా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.






