Supreme Court: మారేందుకు కేంద్రం రెడీగా లేదు.. సుప్రీంకోర్టు అసంతృప్తి

మరణశిక్ష అమలు విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా తప్పుబట్టింది. ఉరిశిక్షకు బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్ విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఖైదీలకు కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం (Supreme Court) ఈ అంశంపై విచారణ చేపట్టింది. “కాలానికి అనుగుణంగా మార్పులు వస్తున్నా, వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రభుత్వం మారేందుకు సిద్ధంగా లేదని స్పష్టంగా కనిపిస్తోంది,” అని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
పిటిషనర్ తరపు న్యాయవాది రిషి మల్హోత్రా.. ఉరిశిక్ష “క్రూరమైన, అమానవీయమైన ప్రక్రియ” అని, ప్రాణాంతక ఇంజెక్షన్ మానవీయమైన గౌరవప్రదమైనద విధానమని వాదించారు. గౌరవప్రదమైన మరణ ప్రక్రియను ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఖైదీలకు ఈ ఎంపిక కలగజేయడం ఆచరణాత్మకం కాదని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు (Supreme Court).. ఈ పిటిషన్‌పై విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది.