ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూంలో సీసీటీవీలు ఆఫ్ చేయడమేంటి? : సుప్రియా సూలే ఫైర్

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లోని సీసీటీవీలు ఆఫ్ కావడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అనుమానాలు వ్యక్తం చేసింది. బారామతి నియోజకవర్గంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూంలో దాదాపు 45 నిమిషాల పాటు సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేశారని, ఇది ఎవరో కావాలనే చేసినట్లున్నారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామాతి లోక్‌సభ అభ్యర్థి సుప్రియా సూలే ఆరోపించారు. అలాగే కెమెరాలు ఆఫ్‌లో ఉన్న సమయంలో లోపల ఏదో తప్పు జరిగే ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు.
కాగా.. మే 7న జరిగిన 3వ దశ పోలింగ్‌లో మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మకమైన బారామతి నియోజకవర్గంతో పాటు మరో 10 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను బారామతిలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌లో పటిష్ఠ బందోబస్తు మధ్య భద్రపరిచారు. అయితే ఈవీఎంలను భద్రపరిచిన ఈ గోడౌన్‌లో సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీలను సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంటల మధ్య 45 నిమిషాల పాటు ఆఫ్ చేశారంటూ సుప్రియా సూలే ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులకు, పోలీసులకు తెలియజేసినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీసీటీవీ ఆఫ్ అయిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సుప్రియా సూలే.. ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ లోపల ఏదో తప్పు జరిగిందని తమకనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.