Army: ఇండియన్ ఆర్మీ దమ్ము ఏంటో చెప్పిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్..!

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్(Pakistan) పై భారత్(India) ప్రతీకార దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దుల్లో వైమానిక దాడులకు దిగింది భారత్. ఇందులో మసూద్ అజర్ ఉగ్రవాద సంస్థ.. జైషే మహ్మద్ ను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడుల్లో మసూద్ అజర్ తీవ్రంగా నష్టపోయినట్టు పాకిస్తాన్ మీడియా కూడా ప్రకటించింది. తాజాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తొలిసారిగా తన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా.. బహవల్‌పూర్‌లో భారత ఆర్మీ జరిపిన దాడిలో తమ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించారని జైషే మహ్మద్ అంగీకరించింది. వైరల్‌గా మారిన ఒక వీడియోలో.. జైషే అగ్ర కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ.. ఉగ్రవాద సంస్థకు జరిగిన నష్టాలను అంగీకరించాడు. మే 7న బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం – జామియా మసీదు సుభాన్ అల్లాపై జరిగిన దాడిలో అజార్ కుటుంబం ముక్కలు అయిపోయిందని కాశ్మీరి పేర్కొన్నాడు.
తాము అన్నింటినీ త్యాగం చేసిన తర్వాత.. మే 7న, బహవల్‌పూర్‌లో భారత దళాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయని ఆవేదనగా మాట్లాడాడు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు మరణించిన ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. లాహోర్ నుండి 400 కి.మీ దూరంలో ఉన్న పాకిస్తాన్‌లోని 12వ అతిపెద్ద నగరమైన బహవల్‌పూర్‌పై జరిగిన దాడిలో , అజార్ బంధువులు 10 మంది మరణించారు. వీరిలో అతని సోదరి, ఆమె భర్త, అతని మేనల్లుడు, అతని మేనకోడలు నలుగురు పిల్లలు ఉన్నారని పాకిస్తాన్ మీడియా తెలిపింది. తెల్లవారుజామున జరిగిన దాడిలో అజార్ సహాయకులు నలుగురు కూడా మరణించారని జైషే మహ్మద్ ప్రకటించింది.