Group 1: గ్రూప్-1 పై డివిజన్ బెంచ్ కు వెళ్లిన TGPSC

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై (Group 1) వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలని, లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోతే, మునుపటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను రద్దు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై తాజాగా TGPSC హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఏప్రిల్ 26, 2022న 503 పోస్టులకోసం జారీ అయింది. సుమారు 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 16, 2022న జరిగింది. కానీ 2023 మార్చిలో ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దయింది. ఇతర పరీక్షలు కూడా రద్దయ్యాయి. 2024లో కొత్త నోటిఫికేషన్ జారీ చేసి 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ లో ప్రిలిమ్స్ జరిగింది. 31,382 మంది మెయిన్స్‌కు ఎంపిక అయ్యారు. మెయిన్స్ అక్టోబర్ 21-27 వరకు జరిగింది. ఫలితాలు ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యాయి. అయితే, వాల్యూయేషన్ లో అక్రమాలు జరిగాయని, రిజర్వేషన్ నియమాలను పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఇదే ఆరోపణలతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
సెప్టెంబర్ 9న జస్టిస్ ఎల్.నగరాజు బెంచ్ ఈ ఆరోపణలను సమర్థించింది. మెయిన్స్ ఫలితాలు, ర్యాంకింగ్ లిస్ట్‌ను రద్దు చేసింది. వాల్యుయేషన్ లో స్పష్టత కొరవడిందని, రిజర్వేషన్ నియమాలు పాటించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మళ్లీ వాల్యూయేషన్ చేయాలని, లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం 8 నెలలు గడువిచ్చారు. దీనిపై తాజాగా TGPSC డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే, కొంతమంది అభ్యర్థులు కూడా డివిజన్ బెంచ్‌లో పిటిషన్లు దాఖలు చేశారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టులను ఓపెన్ మార్కెట్‌లో విక్రయించిందని ఆరోపించారు. ప్రతి పోస్టుకు 3 కోట్లు వసూలు చేసి, నిరుద్యోగ యువకుల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. 74 ర్యాంకులు కేవలం రెండు సెంటర్ల నుంచే రావడం ఇందుకు నిదర్శనమన్నారు. మంత్రులు, అధికారులు కలిసి ఈ కుట్ర చేశారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మరోవైపు, గ్రూప్-1 పోస్టులు కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కున్నారనే ఆరోపణలు అభ్యర్థుల తల్లిదండ్రులు తప్పుబట్టారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లమని, 3 కోట్లు ఖర్చు పెట్టి పోస్టులు కొనుక్కునే స్థోమత తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పిల్లలు కష్టపడి చదువుకుని ఎంపికయ్యారని స్పష్టం చేశారు. వాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విమర్శలను తిప్పికొట్టింది. పదేళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించని బీఆర్ఎస్, ఇప్పుడు రాజకీయ లబ్దికోసం చౌకబారు విమర్శలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
2022 నుంచి గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతో ఆశగా తుది ఫలితాలకోసం ఎదురు చూస్తున్నారు. కానీ విమర్శలు, న్యాయపరమైన చిక్కులతో ఇది కొలిక్కి రావట్లేదు. ఇప్పుడు TGPSC డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడంతో వివాదానికి ముగింపు లభిస్తుందా.. లేదంటే మళ్లీ కొనసాగుతుందా.. అనేది వేచి చూడాలి.