Modi Birthday: ప్రధాని మోడీ 75వ బర్త్ డే..! శుభాకాంక్షల వెల్లువ..!!

ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఇవాళ తన 75వ పుట్టినరోజును (Brithday) జరుపుకుంటున్నారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడ్‌నగర్ గ్రామంలో జన్మించారు మోడీ. చాయ్ వాలా కుమారుడిగా మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా మారారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాల్లో అపార పురోగతి సాధించింది. ఈ సందర్భంగా దేశవిదేశాల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు, సినిమా తారలు, సామాన్య ప్రజలు భారీ సంఖ్యలో మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ‘సేవా పక్ష్వాద’ పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజుల ప్రచారం చేపట్టింది. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరాలు, శుభ్రత, మహిళా ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ప్రధాని మోడీ తన పుట్టినరోజును మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరుపుకున్నారు. అక్కడ ఆయన ‘స్వాస్థ్య నారీ, సశక్త్ పరివార్’, ‘రాష్ట్రీయ పోషణ్ మాస్’ కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, అనీమియా, కేన్సర్ వంటి వ్యాధుల నిర్మూలనకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయి. మోడీ సొంత నియోజకవర్గంలో వారణాసిలో గంగాహారతి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ నాయకులు ఇండియా గేట్ వద్ద ‘సేవా సంకల్ప వాక్’ చేపట్టారు. రక్తదాన శిబిరాల్లో పలువురు నేతలు రక్తం దానం చేశారు. యూపీలో ‘స్వచ్ఛతా అభియాన్’ చేపట్టారు. మధ్యప్రదేశ్‌లో మొక్కలు నాటారు. హర్యానాలో 75,000 మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
దేశంలోని అన్ని పార్టీల నాయకులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము మోడీ దేశంలో గొప్ప లక్ష్యాలు సాధించే సంస్కృతిని ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రపంచం ఆయన మార్గదర్శకత్వంపై విశ్వాసం చూపుతోందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ కూడా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు అమిత్ షా, నితిన్ గడ్కరీ తదితరులు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నాయకుడు మోడీ అని, ఆయన నేతృత్వంలో భారత్ స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. బిహార్ సీఎం నీతిష్ కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితరులు కూడా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
పలువురు సినిమా ప్రముఖులు కూడా మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. షారుఖ్ ఖాన్, నరేంద్ర మోడీ ప్రస్థానాన్ని కొనియాడారు. ఒక చిన్న ఊరి నుంచి ప్రపంచ స్థాయికి ఎదగడం అద్భుతం అన్నారు. ఆయన శ్రమ, క్రమశిక్షణ ప్రేరణ కలిగిస్తాయన్నారు. ఆమిర్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, ఎస్‌ఎస్ రాజమౌళి, అనుపమ్ ఖేర్, రజనీకాంత్, నాగార్జున, మహేశ్ బాబు, ఆలియా భట్, శతృఘ్న సిన్హా తదిదతురులు మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు విడుదల చేశారు. క్రికెటర్ కపిల్ దేవ్, గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తదితరులు మోడీకి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఆయన అరుదైన నాయకుడని కొనియాడారు.
విదేశాల నుంచి కూడా పలువురు ప్రముఖులు మోడీకి శుభాకాంక్షలతో ముంచెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోడీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. “నా స్నేహితుడు మోడీకి హ్యాపీ బర్త్ డే!” అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. మోడీ స్పందిస్తూ, భారత-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత పెంచాలన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు “మా మంచి స్నేహితుడు మోడీకి శుభాకాంక్షలు. భారత్-ఇజ్రాయెల్ స్నేహం బలపడింది” అన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ “మంచి ఆరోగ్యం, నాయకత్వం కొనసాగాలి” అని అన్నారు. యూకే మాజీ ప్రధాని రిషి సునక్, భూటాన్ ప్రధాని త్షెరింగ్ తోబ్గే, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, ఆస్ట్రేలియా ప్రధాని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ.. తదితరులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ఎక్స్ లో దేశవిదేశీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ దేశ ప్రధానికి ఈ స్థాయిలో శుభాకాంక్షలు రావడం బహు అరుదు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.