Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’ (Beauty). అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘బ్యూటీ’ నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు కదా?
సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అని అంటే కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా నిర్మిస్తూనే ఉండాలనే ఉద్దేశం, లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కథలు, అన్ని రకాల జానర్లలో డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని అనుకుంటూ ఉన్నాను. అందుకే ‘బార్బరిక్’, ‘బ్యూటీ’ చిత్రాలను నిర్మించాను. నెక్ట్స్ హారర్, కామెడీ ప్రధాన చిత్రాలను నిర్మించాలని అనుకుంటున్నాను.
‘బ్యూటీ’ జర్నీ ఎలా సాగింది?*
ఇప్పటి వరకు ‘బ్యూటీ’ జర్నీ ఎంతో బాగా సాగింది. టైటిల్ ఎంతో క్యాచీగా ఉండటంతో.. జనాల్లోకి ఎక్కువగా వెళ్లింది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు చూసిన వారంతా కూడా మూవీని మెచ్చుకున్నారు. రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.
‘బ్యూటీ’లో మీకు నచ్చిన అంశమేంటి?
‘బ్యూటీ’ కథలో అందమైన ప్రేమ కథతో పాటుగా మనసుని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రంగా మా ‘బ్యూటీ’ నిలుస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూడదగ్గ చిత్రం. నాకు పర్సనల్‌గా ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం. ఈ కథలోని ఎమోషన్స్ నచ్చే నిర్మించేందుకు ముందుకు వచ్చాను.
మారుతి గారు, జీ స్టూడియో సహకారం ఎలా ఉంది?
‘బ్యూటీ’ కథను విన్న వెంటనే ఈ మూవీని చేద్దామని మారుతి గారికి చెప్పాను. జీ స్టూడియో సహకారం వల్లే మా సినిమాను ప్రతీ ఒక్కరికీ రీచ్ చేయగలిగాం. రిలీజ్ విషయంలో వారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా మూవీని దాదాపు 150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్‌తో తరువాత మళ్లీ థియేటర్లను పెంచుతాం.
‘బ్యూటీ’ విషయంలో బడ్జెట్ ఎందుకు పెరిగింది?
‘బ్యూటీ’ని ప్రారంభంలో వేరే హీరోయిన్‌తో షూటింగ్ చేశాం. ఓ వారం రోజులు అలా షూటింగ్ చేశాం. ముందుగా రైటర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. హీరోయిన్ పక్కింటి అమ్మాయిలా ఉండాలి అనుకున్నాం. ఆ హిరోయిన్ పాత్రకు అంతగా సెట్ అవ్వడం లేదు అని అంతా అనుకున్నాం. ఆ తరువాత నీలఖి ఈ సినిమాలోకి వచ్చారు. అలా సినిమా ఆరంభంలో చేసిన షూటింగ్ అంతా వృథా అయింది. దాని వల్ల బడ్జెట్ కాస్త పెరిగింది.
‘బ్యూటీ’కి ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
‘బ్యూటీ’ మూవీని ఇప్పటి వరకు చాలా మంది చూశారు. కొందరైతే ‘బేబీ’, ‘కోర్ట్’ స్టైల్లో ఉందని మెచ్చుకున్నారు. ఇంకొందరు అయితే వంద కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న చిత్రమిదని ప్రశంసించారు. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని పొగిడారు.