Kerala: కేరళలో కొత్త వైరస్ భయం..!

కేరళ(Kerala)ను నిత్యం ఏదోక వ్యాధి కలవరపెడుతునే ఉంది. ఇటీవలి కాలంలో కరోనా, నిఫా, మంకీ ఫాక్స్ వంటి వైరస్ లతో కేరళ ఎక్కువగా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరో వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) వ్యాప్తిపై అక్కడ ఆందోళన ఆ దేశంలో పెరుగుతోంది. ఈ తరుణంలో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తమ రాష్ట్రంలో ఈ ఏడాది 69 కేసులకు పైగా నమోదు అయ్యాయి అని ప్రకటించారు.
మొత్తం 19 మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నీటి కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుందని పరిశోధకులు గుర్తించారు. మూడు నెలల శిశువు నుండి 91 ఏళ్ల వయస్సు గల వ్యక్తి వరకు ఈ వ్యాధి రోగులు ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. కేరళ తీవ్రమైన ప్రజారోగ్య సవాలును ఎదుర్కొంటోందని వీణా జార్జ్ ఆందోళన వ్యక్తం చేసారు. గతంలో కోజికోడ్, మలప్పురం వంటి జిల్లాల్లోని క్లస్టర్లకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి.
ఈ వ్యాధి చాలా అరుదని పరిశోధకులు వెల్లడించారు. ఈ వ్యాధి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మెదడు కణజాలాన్ని నాశనం చేయడంతో కొన్ని సందర్భాలలో తీవ్రమైన మెదడు వాపుతో పాటుగా మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. నిలబడిన నీటిలో ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ కనపడుతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. నిల్వ ఉన్న నీటిని తాగడం మంచిది కాదని, ఈ వ్యాధి లక్షణాలు కనపడితే వెంటనే వైద్యులను కలవాలని ప్రభుత్వం సూచించింది. అకస్మాత్తుగా అధిక జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, మెడ నొప్పి, గందరగోళంగా ఉండటం, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనపడితే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం అక్కడి ప్రజలను కోరింది.