Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో భారతీయ క్రికెటర్ల హవా కొనసాగుతోంది. పొట్టి క్రికెట్ లో దుమ్ము రేపుతున్నారు. ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో దుమ్మురేపిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఐసీసీ (ICC Rankings) ర్యాంకుల్లోనూ దూసుకొచ్చారు. ఇప్పటికే టీ20 బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు బౌలింగ్‌లోనూ టాప్ ర్యాంక్ భారత క్రికెటర్‌కే దక్కింది. తాజాగా ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది.
ఏడాదంతా అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) ఐసీసీ టీ20 టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. దీంతో భారత్ తరఫున అగ్రస్థానం దక్కించుకున్న మూడో బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ ఈ ఘనత సాధించారు. ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లోనూ నాణ్యమైన ప్రదర్శన చేయడంతో వరుణ్ ర్యాంకింగ్ మారిపోయింది. మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరాడు. ప్రస్తుతం వరుణ్ ఖాతాలో 733 పాయింట్లు ఉన్నాయి. అతడి తర్వాత జాకబ్ డఫీ (717), అకీల్ హుసేన్ (707), ఆడమ్ జంపా (700), అదిల్ రషీద్ (677) టాప్ -5లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్న రవి బిష్ణోయ్ రెండు ర్యాంకులు దిగజారి 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. గత రెండు టీ20ల్లో ఏడు వికెట్లు తీసిన కుల్‌దీప్ యాదవ్ ఏకంగా 16 స్థానాలను మెరుగుపర్చుకుని 23వ ర్యాంకులోకి దూసుకొచ్చాడు.
అభిషేక్, హార్దిక్‌దే…
ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచుల్లోనూ దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ (884) తన పాయింట్లను పెంచుకున్నాడు. దక్షిణాఫ్రికాపై భారీ శతకం చేసిన ఫిల్ సాల్ట్ (838), దూకుడుగా ఆడిన జోస్ బట్లర్ (794) తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. ఇక తిలక్ వర్మ (792) నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. పాక్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ (747) కూడా ఒక స్థానం దిగజారి ఏడులో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య (237)నే టాపర్. అక్షర్ పటేల్ (163) రెండు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌కు, అభిషేక్ శర్మ (161) నాలుగు స్థానాలు దూసుకొచ్చి 14వ ర్యాంకులో చేరారు.