Maoist Party: ఆ లేఖ మావోయిస్ట్ లే రాసారా..?

దాదాపు రెండేళ్ల నుంచి ఆపరేషన్ కగార్(Operation Kagar) తో ఇబ్బంది పడుతున్న, మావోయిస్టు పార్టీ ఇప్పుడు శాంతి మార్గం వైపు పయనిస్తోంది. గత కొన్నాళ్లుగా కీలక సహచరులను కోల్పోవడం, అలాగే మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోవడంతో, ఇప్పుడు ఆ పార్టీ ఆత్మ రక్షణలో పడింది. కేంద్ర హోంశాఖ మావోయిస్టు పార్టీపై ఉక్కు పాదం మోపటంతో, బలగాలను కాపాడుకోవడం కూడా ఆ పార్టీకి కష్టంగా మారింది. దీనితో మావోయిస్టు పార్టీ అభయ్(Abhay) పేరుతో లేఖను విడుదల చేసింది.
ఈ లేఖలో పీడిత ప్రజల తరఫున పోరాడుతామని, కానీ ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టులు ప్రకటించారు. అంతేకాకుండా ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు, సోషల్ మీడియా ఎకౌంట్లను కూడా మావోయిస్టు పార్టీ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమకు నెలరోజుల పాటు సమయం ఇవ్వాలని, మల్లోజుల వేణుగోపాల్ ఫోటోతో ఉన్న ఓ లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. వాస్తవానికి అగ్ర నాయకుల ఫోటోలను మావోయిస్టు పార్టీ ఈ మధ్యకాలంలో విడుదల చేయలేదు. దీనితో అనేక అనుమానాలు వస్తున్నాయి.
అటు నిఘా వర్గాలు కూడా, దీని విషయంలో ముందు అనుమానం వ్యక్తం చేసినా, నిజమేనని ధృవీకరించాయి. మావోయిస్టు పార్టీ తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రకటించడంపై మాజీ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ మావోయిస్టు పార్టీ ఉనికి గురించి ఇలా అధికారిక ప్రకటనలు ఇవ్వలేదు. నిఘా వర్గాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే మావోయిస్టు పార్టీ ప్రాధాన్యత ఇచ్చేదని, అలాంటిది ఇంటర్నెట్ ఖాతాలను ప్రకటించడంపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు సూచిస్తున్నారు.
ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణంతో, మావోయిస్టు పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత తిప్పిరి తిరుపతిని మావోయిస్టు పార్టీ తమ అధినేతగా ప్రకటించింది. అటు కేంద్ర కమిటీ సభ్యులు కూడా భారీగా మరణించడం, లేదా లొంగిపోవడం, ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో మావోయిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు రిక్రూట్మెంట్ కూడా భారీగా తగ్గిపోవడం మావోయిస్టులను మరింత కలవర పెడుతున్న అంశం. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిగా మావోయిస్టు పార్టీ తమ ఉనికి కోల్పోయింది. దండకారణ్యంలో సైతం కష్టమైన పరిస్థితి ఎదుర్కోవడం, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండటంతో ఉద్యమాన్ని మరిన్ని కొంతకాలం ముందుకు నడిపించడం కష్టమేననే భావనలో మావోయిస్టు పార్టీ కీలక నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.