Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..

పాకిస్తాన్ ఉగ్ర ముసుగు తొలగిపోయింది. దశాబ్దాల తరబడి భారత్ పై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. దాన్ని కశ్మీరీల స్వతంత్ర పోరాటంగా చెప్పుకునే పాక్ … ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయింది. సాక్షాత్తూ పాక్ మంత్రులే .. పలు సందర్భాల్లో నోరు జారి అంగీకరిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు లేటెస్టుగా ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కమాండర్లు సైతం..భారత్ పై దాడులకు తమదే బాధ్యతని అంగీకరిస్తున్నారు. దీంతో పాక్ అంతర్జాతీయ వేదికలపై నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది.
భారత పార్లమెంట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి, 26/11 ముంబయి మారణకాండ వెనుక జైషే (Jaish-e-Mohammed) అధినేత మసూద్ అజర్ (Masood Azhar behind Parliament attack) హస్తం ఉందని ఆ సంస్థ టాప్ కమాండర్ అంగీకరించాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల ఆ సంస్థకు చెందిన మసూద్ ఇలియాస్ కశ్మీరి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘అమిర్ ఉల్ ముజాహిద్దీన్ మౌలానా మసూద్ అజర్ భారత్ జైలు నుంచి బయటపడి పాకిస్థాన్ వచ్చాక బాలాకోట్‌లో ఆయనకు ఆశ్రయం లభించింది. ’’ అని పేర్కొన్నాడు. పాకిస్థాన్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొంది భారత్ (India) పై దాడులు చేస్తున్నారనటానికి ఈ ప్రకటన బలమైన ఆధారంగా నిలిచింది.
ఇలియాస్ కశ్మీరీ (Masood Ilyas Kashmiri) చెప్పినదాని ప్రకారం మసూద్ అజార్ బాలాకోట్ (BALAKOT) ను అడ్డాగా చేసుకొని ఎప్పటి నుంచో భారత్‌పై ఉగ్ర కుట్రలు పన్నుతున్నట్లు తేలింది. ఇక ఒసామా బిన్ లాడెన్‌ను ఇలియాస్ అమరవీరుడిగా పోల్చాడు. పాక్ సైన్యం పహారాలో జైషే స్థావరం (Jaish camp) స్వేచ్ఛగా నడుస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. పాక్ మాత్రం అక్కడ ఎటువంటి ఉగ్ర క్యాంపులు లేవని ప్రపంచానికి నమ్మబలుకుతోంది.
ఇప్పటికే ‘ఆపరేషన్ సిందూర్’తో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ (Masood Azhar) కుటుంబీకులు ముక్కలు ముక్కలైపోయారని ఇలియాస్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ‘‘ మేం ఢిల్లీతో పోరాడాం. కాబూల్‌తో పోరాడాం. కాందహార్‌తో పోరాడాం. అన్నింటినీ త్యాగం చేశాం. మే 7న బహావల్‌పుర్‌పై భారత్ జరిపిన దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ముక్కలైపోయారు’’ అని ఇలియాస్ వ్యాఖ్యానించాడు.