TRP: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. పేరు ఇదే..!

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఎప్పుడూ వివాదాలకు, ఆకట్టుకునే మాటలకు కారణమయ్యే పేరు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna). ఈయన అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ (Chinthapandu Navin Kumar). తెలంగాణ ఉద్యమ కాలంలో తీన్మార్ న్యూస్ అనే సెటైరికల్ టీవీ షోతో ప్రజల్లో పాపులర్ అయిన మల్లన్న, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీసీలకు రాజ్యాధికారం, ఆత్మగౌరవం, వాటా లాంటి అంశాలపై ఎప్పుడూ మాట్లాడే మల్లన్న.. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా (MLC) ఎన్నికయ్యారు. అయితే తక్కువ కాలంలోనే సస్పెన్షన్ కు గురయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో అధికారికంగా పార్టీ ప్రకటించారు. దీనికి “తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)” అనే పేరు పెట్టారు.
తీన్మార్ మల్లన్న పేరు తెలియని వారుండరు. 1982 జనవరి 17న జన్మించిన మల్లన్న ఓ టీవీ షోలో తీన్మార్ న్యూస్ అనే సెటైరికల్ షో ద్వారా ప్రసిద్ధి చెందారు. ఈ షోలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ విధానాలపై హాస్యాస్పదంగా, ఆలోచింపజేసేలా విమర్శలు చేసేవారు. ముఖ్యంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ మీద చేసిన విమర్శలు ఆకట్టుకునేవి. 2015లో ఆ చానల్ నుంచి బయటికొచ్చి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో (నల్గొండ-ఖమ్మం-వరంగల్) కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. ఈ సమయంలోనే బీసీల హక్కులు, రిజర్వేషన్లపై మాట్లాడటం మొదలుపెట్టారు. 2021లో మళ్లీ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానం సాధించారు. BRS అభ్యర్థిని దాదాపు 1 లక్ష ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా BRS ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బీసీలకు అధికారంపై చర్చ రేకిత్తించారు.
అయితే.. 2021 డిసెంబర్ 7న ఢిల్లీలో మల్లన్న BJP కండువా కప్పుకున్నారు. అయితే ఎక్కువకాలం అందులో ఉండలేదు. 2023 నవంబర్ 8న కాంగ్రెస్‌లో చేరారు. 2024 గ్రాడ్యుయేట్ MLC బై-ఎలక్షన్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి, ఎమ్మెల్సీ అయ్యారు. బీసీల రాజ్యాధికారం, కులగణన సర్వేలపై గళం విప్పడం కొనసాగించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా మల్లన్న పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటం కొనసాగించారు. హన్మకొండలో జరిగిన బీసీ సభలో పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కులగణన రిపోర్ట్‌ను కాల్చేశారు. దీంతో అతనికి షోకాజ్ నోటీసు జారీ అయింది. మల్లన్న సమాధానం ఇవ్వకపోవడంతో మార్చి 1న సస్పెండ్ అయ్యారు.
తాజాగా తెలంగాణ విమోజన దినంగా పేరొందిన సెప్టెంబర్ 17న మల్లన్న కొత్త పార్టీ ప్రకటించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్‌లో బీసీలు, వివిధ కుల సంఘాల నేతలు, వేలాది మంది కార్యకర్తల సమక్షంలో ఆయన పార్టీ విధివిధానాలను వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవం, అధికారం, వాటా ముఖ్య ఎజెండా అని తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించడం తన ధ్యేయమన్నారు. ఇందుకోసం బీసీలంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. జెండా పై భాగం ఎరుపు, కిందిభాగంలో ఆకుపచ్చ కలిగి ఉన్నాయి. మధ్యలో పిడికిలి బిగించిన చేయి, కార్మిక చక్రం, వరి కంకులు. రెండు వైపులా ఆలీవ్ ఆకులు ఉన్నాయి. పార్టీ వెబ్‌సైట్‌ను ఒక సామాన్యుడితో లాంచ్ చేయించారు. దేశంలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని పార్టీ స్పోక్స్‌పర్సన్‌గా నియమించారు. మరి మల్లన్న నేతృత్వంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంతమేర సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.