బెంగాల్ ఎస్ఐఆర్పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ చుట్టూ నెలకొన్న రాజకీయ, రాజ్యాంగ ప్రతిష్ఠంభనపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రస్థాయిలో స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం (EC) మధ్య సాగుతున్న నిందల పర్వంపై అసహనం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో తలెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు జ్యుడిషియల్ అధికారులను రంగంలోకి దించాలని కలకత్తా హైకోర్టును ఆదేశించింది.
రాజ్యాంగ వ్యవస్థల మధ్య అపనమ్మకం:
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం (Supreme Court) ఈ కేసును విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వంటి రెండు బాధ్యతాయుతమైన రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడింది. “ఈ పరిణామం వ్యవస్థల మధ్య ఉన్న అపనమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. అభ్యంతరాల స్వీకరణ దశలోనే ఈ కీలక ప్రక్రియ ఆగిపోవడం సరికాదు” అని ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ పరిశీలన కోసం గ్రేడ్-ఏ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు:
ఈ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) ఒక మధ్యంతర మార్గాన్ని సూచించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా వచ్చిన దరఖాస్తులు, వాటిపై ఉన్న అభ్యంతరాలను నిష్పాక్షికంగా పరిశీలించేందుకు జ్యుడిషియల్ అధికారులు, మాజీ న్యాయమూర్తుల సాయం తీసుకోవాలని కలకత్తా హైకోర్టుకు దిశానిర్దేశం చేసింది. ఇందుకోసం అవసరమైన అధికారులను తక్షణమే నియమించాలని స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితా సవరణ వంటి కీలక ప్రక్రియలు ఆగిపోకూడదని, ప్రజల ఓటు హక్కుకు సంబంధించిన ఈ వ్యవహారంలో పారదర్శకత అత్యవసరమని కోర్టు అభిప్రాయపడింది.
సాధారణంగా ఎన్నికల విధుల్లో ప్రభుత్వ అధికారులే కీలక పాత్ర పోషిస్తారు. కానీ బెంగాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా న్యాయశాఖ అధికారులను ఈ విధుల్లో చేర్చాలని సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి

















