Rajnath Singh: వారికి త్వరలోనే గట్టిబదులిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ (India)పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) అండగా ఉంటుందని అన్నారు. దాడికి పాల్పడిన వారిని, కుప్ర పన్ని వారిని బయటకు లాగి, తగిన బుద్ధి చెబుతామని అన్నారు. పహల్గాం ఘటనకు సంబంధించిన విషయాలు, శ్రీనగర్‌లో భద్రతా చర్యలు వంటి వాటి గురించి ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi), నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి (Dinesh Tripathi)తో చర్చలు జరిపిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.