ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర సీఎం చేయాలని బీజేపీ.. అసంతృప్తిలో షిండే : రామ్‌దాస్ అథవాలే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల అనంతరం మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ మొదలైంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో.. బీజేపీ నేత ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని ఆ పార్టీ ఆలోచిస్తోందని అథవాలే అన్నారు. అయితే ఈ నిర్ణయం శివసేన నేత, మాజీ సీఎం ఏక్ నాథ్ షిండేకు నచ్చలేదని, ఆయన అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఉందని అథవాలే పేర్కొన్నారు. ఈ వివాదానికి త్వరలోనే తెరపడుతుందని హామీ ఇచ్చారు.
ఇంతకాలం షిండే నాయకత్వంలో ఫడ్నవీస్ పనిచేసినట్లే.. ఇప్పుడు ఫడ్నవీస్ నాయకత్వంలో పనిచేసే విషయంపై షిండే ఆలోచించాలని అథవాలే సూచించారు. షిండే ఉప ముఖ్యమంత్రి కావచ్చని లేదా కేంద్ర మంత్రి కూడా కావచ్చని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయంపై ఆలోచించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మహారాష్ట్ర కేబినెట్‌లో తమ పార్టీకి కూడా కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేసినట్లు ఆయన తెలియజేశారు.