Prashant Kishor: బిహార్ ఎన్నికల్లో మేమే కింగ్ మేకర్స్…మళ్లీ నితీష్ సీఎం కాలేరన్న ప్రశాంత్ కిశోర్..!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఏ కూటమి విజయభేరీ మోగిస్తుంది. ఎవరు సీఎంగా ఎన్నికవుతారు.. దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ఇక బిహార్ లోని పార్టీలైతే.. ఈఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అత్యంత కీలకంగా మారింది జన్ సురాజ్ పార్టీ. కింగ్ మేకర్ గా అవతరిస్తామంటోంది ఆపార్టీ.
ఈ కీలక తరుణంలో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానం నుంచీ తాను పోటీ చేయకూడదని ప్రశాంత్ కిశోర్ నిర్ణయించుకున్నారు. ఒక స్థానంపైనే దృష్టి పెడితే పార్టీ సంస్థాగత పని నుంచి దృష్టి మళ్లించాల్సి వస్తుంది కాబట్టి విశాల ప్రయోజనాల కోసం పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అందుకే రాఘోపుర్ నుంచి ఆర్జేడీ అభ్యర్థి తేజస్వీ యాదవ్‌పై తనబదులు మరో అభ్యర్థిని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ‘‘బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ గెలిస్తే అది దేశ రాజకీయాల్లో కొత్తమలుపు తీసుకువస్తుంది. మా పార్టీకి 150 సీట్ల కంటే తక్కువ వస్తే దాన్ని ఓటమిగానే పరిగణిస్తాం. వందమంది అత్యంత అవినీతిపరులైన నేతలు, అధికారులపై తొలినెలలోనే కొరడా ఝళిపిస్తాం’’ అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని, లేదంటే పదిలోపు స్థానాలకు పరిమితం అవుతామని అంచనావేశారు.
జేడీ(యూ)కు కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని, నీతీశ్‌కుమార్ మరోసారి సీఎం కాలేరని చెప్పారు. తీర్పు స్పష్టంగా రాకపోతే ఎన్డీయే, ఇండియా కూటముల్లో దేనికి మద్దతు ఇస్తారనే ప్రశ్నకు సమాధానమిస్తూ- సంకీర్ణం ఏర్పడే పరిస్థితే తలెత్తదని చెప్పారు.
ఎన్నికలకు ముందే పేలిన బుడగ: ఆర్జేడీ
పోటీ చేయకూడదనే ప్రశాంత్ కిశోర్ నిర్ణయాన్ని ఆర్జేడీ తీవ్రంగా విమర్శించింది. ఎన్నికలకు ముందే బుడగ పేలిపోయిందని, సలహాదారుగా ఉండటానికి.. ఎన్నికల బరిలో దిగడానికి చాలాతేడా ఉందంది. యుద్ధభూమికి వెళ్లకముందే ఆయన ఓటమిని అంగీకరించారని ఎద్దేవా చేసింది. పరిస్థితి తనకు అనుకూలంగా లేదని ప్రశాంత్ కిశోర్‌లోని వ్యాపారవేత్త గ్రహించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ఓటమి భయంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ విమర్శించారు.