Tilak Varma: మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌లో క్రికెటర్ తిలక్ వర్మకు సత్కారం

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), హిట్ మోషన్ అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు షూటింగ్ వేగంగా జరుగుతోంది. చిత్రీకరణలో బిజీగా ఉన్న చిరంజీవి, ఒక మంచి సందర్భానికి సమయం కేటాయించారు.
ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) ను మెగాస్టార్ సన్మానించారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలకమైన భాగస్వామి అయిన తిలక్ వర్మ ప్రతిభను చిరంజీవి అభినందించారు.
తన సహజమైన వినయం, పెద్ద మనసుతో చిరంజీవి, తిలక్ వర్మను ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆయనకు శాలువా కప్పి, మ్యాచ్‌లోని ఆయన మెమొరబుల్ మూమెంట్ ని ఫ్రేమ్ చేసిన ఫోటోను అందజేశారు. కృషి, క్రమశిక్షణ కేవలం క్రీడలోనే కాకుండా జీవితంలోనూ విజయానికి మార్గదర్శకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపాటి, సుస్మిత కొణిదెల పాల్గొన్నారు. వారు కూడా తిలక్ వర్మని ప్రశంసించారు.
ఇండియన్ సినిమా ఐకాన్ చిరంజీవి చేత సన్మానం పొందడం తిలక్ వర్మకు ఒక ప్రత్యేక క్షణం. దయ, వినయం, సినిమాలకంటే మించి స్ఫూర్తినిచ్చే మెగా వ్యక్తిత్వానికి ఇది మరో అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.