Gujarat: గుజరాత్‌లో సంచలనం.. కేబినెట్ మొత్తం రాజీనామా..!

గుజరాత్ రాజకీయాల్లో (Gujarat) అనూహ్యమైన, సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పరిపాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (CM Bhupendra Patel) నేతృత్వంలోని గుజరాత్ మంత్రివర్గం (Cabinet resignation) మొత్తం రాజీనామా చేసింది. ముఖ్యమంత్రి మినహా మిగిలిన 16 మంది మంత్రులు రాజీనామాలను (Ministers resign) సమర్పించారు. బీజేపీ (BJP) అధిష్టానం ఆదేశాల మేరకు జరిగిన ఈ మూకుమ్మడి రాజీనామాలతో కేబినెట్ ను పూర్తిగా ప్రక్షాళించేందుకు భూపేంద్ర పటేల్ కు మార్గం సుగమమైంది. రాజీనామాలు ఆమోదించిన అనంతరం రేపు గాంధీనగర్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా హాజరుకానున్నారు.
ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా మొత్తం 17 మంది మంత్రులున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో 182 స్థానాలున్నాయి. ఈ మేరకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం 27 మంది వరకు మంత్రులను నియమించే అవకాశం ఉంది. ఈ ప్రక్షాళనలో భాగంగా సుమారు 10 మంది కొత్త మంత్రులను చేర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులలో సగం మందిని తొలగించి, పూర్తిగా కొత్త ముఖాలకు, యువ నాయకులకు అవకాశం కల్పించడంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచడం, కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడం ఈ ప్రక్షాళన వెనుక ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నాయకులు, పటీదార్ వర్గాలకు మరింత ప్రాతినిధ్యం పెంచాలని బీజేపీ యోచిస్తోంది. సౌరాష్ట్ర ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. పటీదార్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో గోపాల్ ఇటాలియా నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో, ఆ ప్రభావానికి చెక్ పెట్టడానికి ఈ మార్పులు అవసరమని పార్టీ భావించింది. ఈ నెల ప్రారంభంలో బీజేపీ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడిగా ఓబీసీ నేత జగదీష్ విశ్వకర్మ నియమితులయ్యారు. ఇది ప్రక్షాళనకు తొలి సంకేతంగా భావించారు. కేంద్ర నాయకత్వం మార్గదర్శకత్వంలోనే ఈ మార్పులు జరుగుతున్నాయి.
రాజీనామా చేసిన వాళ్లలో ధర్మేంద్రసింహ్, రిషికేష్ పటేల్, ముకేష్ పటేల్, భూపేంద్రసింహ్ చుడాసామా వంటి కొందరు మంత్రులను తిరిగి కేబినెట్ లోకి తీసుకోవచ్చనే ఊహాగానాలున్నాయి. ఆర్థిక మంత్రి కనుభాయ్ దేశాయ్, వ్యవసాయ మంత్రి రాఘవ్జీ పటేల్, నీటి పారుదల మంత్రి కుంవర్జీ బవలియా, పర్యాటక మంత్రి మురుభాయ్ బేరా వంటి సీనియర్లను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉంది. జయేష్ రాడాడియా, షంకర్ చౌదరి, అర్జున్ మోధ్వాడియా, జితు వాఘాని, రీవా జడేజా, అల్పేష్ ఠాకూర్ వంటి నాయకులను కొత్త మంత్రులుగా పరిగణిస్తున్నారు. పాలనాపరంగా ముఖ్యమైన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మంత్రులు తమ రాజీనామాలను సమర్పించిన తరువాత, వారికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ను కలిసి కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు లాంఛనంగా విజ్ఞప్తి చేస్తారు. 2021లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేసినప్పుడు కూడా ఇలాంటి భారీ ప్రక్షాళనే జరిగింది. ఆ మార్పులు తరువాతి ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని అందించాయి. ఇప్పుడు కూడా అదే మూకుమ్మడి రాజీనామా మోడల్‌ను అనుసరించడం గుజరాత్‌లో బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగమేనని స్పష్టమవుతోంది.