BC Reservations: రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ… వాట్ నెక్స్ట్..?

బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt) సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో BC రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు మొత్తం 50 శాతం పరిమితిని దాటకూడదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి పునరుద్ఘాటించింది. అవసరమైతే 50 శాతం పరిమితికి లోబడి ఉన్న పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లవచ్చని ప్రభుత్వానికి సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ జీవో నెంబర్ 9ని జారీ చేసింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 67 శాతం దాటుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పుల్లో నిర్దేశించిన 50 శాతం గరిష్ట పరిమితిని ఉల్లంఘిస్తుందంటూ కొందరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను విచారించిన హైకోర్టు, రిజర్వేషన్లు 50 శాతం దాటడం రాజ్యాంగ విరుద్ధమని ప్రాథమికంగా అభిప్రాయపడింది. పెంచిన 42 శాతం రిజర్వేషన్ జీవోపై మధ్యంతర స్టే విధించింది. అయితే, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించి, శాస్త్రీయ డేటా ఆధారంగానే రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించామని, రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో కూడా ఏకాభిప్రాయం వ్యక్తమైందని కోర్టుకు వివరించారు. 50 శాతం పరిమితి అనేది ఫ్లెక్సిబుల్ రూల్ అని, కఠినమైన పరిమితి కాదని వాదించారు. అయితే, ప్రతివాదుల తరఫు న్యాయవాది, రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు స్పష్టంగా ఉన్నాయని గుర్తు చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కూడా ఈ పెంపును తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలంటే ట్రిపుల్ టెస్ట్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, రిజర్వేషన్ల పెంపు 50 శాతం పరిమితిని దాటడం రాజ్యాంగ ధర్మాసనం తీర్పులకు విరుద్ధమని అభిప్రాయపడింది. హైకోర్టులో కేసు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున, ఈ దశలో జోక్యం చేసుకోలేమని, పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ కొట్టివేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో, తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపు విషయంలో న్యాయపరమైన అడ్డంకిని ఎదుర్కొంది. ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విచారణపైనే ఉంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.