CBN: స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీలో సీఎం చంద్రబాబు
స్విస్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరించండి
నైపుణ్యం ఉన్న మానవ వనరులను సిద్దం చేస్తున్నాం
గత ఏడాది సీఎం దావోస్ పర్యటన విజయవంతమైందని వెల్లడించిన భారత రాయబారి వెల్లడి
జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
జ్యూరిచ్ స్విట్జర్లాండ్, జనవరి 19: స్విట్జర్లాండ్ లోని ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశంలోని భారత రాయబారి మృదుల్ కుమార్ ను కోరారు. పెట్టుబడుల సాధన కోసం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబును స్విట్జర్లాండ్ లోని భారత రాయబారి మృదుల్ కుమార్ సమావేశమయ్యారు. వీరి భేటీలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ లోని వివిధ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై ఇరువురూ చర్చించారు. ఫార్మా, వైద్య పరికరాలు, యంత్ర పరికరాలు, భారీ మెషినరీ తయారీ, హార్డ్వేర్–ఎలక్ట్రానిక్స్, రైల్ కాంపొనెంట్స్, టెక్నికల్ టెక్స్ టైల్స్, పరిశోధనా కేంద్రాల వంటి అంశాల్లో స్విట్జర్లాండ్ ముందంజలో ఉందని భారత రాయబారి సీఎం బృందానికి వివరించారు. ఈ మేరకు ఫార్మా రంగంతో పాటు.. మెడికల్ ఎక్విప్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా పారిశ్రామికాభివృద్ధి కోసం మొత్తంగా 25 పాలసీలు తెచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. విశాఖ పెట్టుబడుల సదస్సు వివరాలను కూడా సీఎం చంద్రబాబు మృదుల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
గత ఏడాది సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని 2025 లో చేసిన చర్చలు సంప్రదింపుల కారణంగా ఏపీకి సుమారు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాని మృదుల్ కుమార్ వెల్లడించారు. ఇక స్విట్జర్లాండ్ దేశంలో భారతీయులు, తెలుగు వారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారని…వారి అభివృద్ధికి సహకరించాలని సీఎం భారత రాయబారిని కోరారు. ఏపీ నుంచి కూడా ఎన్నార్టీల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐ, క్యాంటం వంటి ఆధునిక టెక్నాలజీ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వివరించారు. యూరోప్ లోని ఈ అతి చిన్న దేశం లిచైన్ స్టైన్ ఏఐను వినియోగించుకుని అభివృద్ధి చెందుతోందని స్విస్ భారత రాయబారి మృదుల్ కుమార్ చెప్పారు. వచ్చే నెలలో భారత దేశంలో జరిగే ఏఐ సదస్సుకు లిచ్టెన్ స్టైన్ దేశ ప్రతినిధులు హాజరు కానున్నట్టు మృదుల్ తెలిపారు.
దీనిపై సీఎం స్పందిస్తూ… ఫిబ్రవరిలో జరగనున్న ఏఐ సదస్సులో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి అవుతుందని చెప్పారు. ఆ సదస్సులో తాను లిచ్టెన్ స్టైన్ దేశ ప్రతినిధులతో భేటీ అవుతానని సీఎం వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”నేడు ఏ దేశంలోకి వెళ్లినా భారతీయుల విజయాలు గర్వకారణంగా ఉంటున్నాయి. నేడు ప్రపంచంలో అనేక దేశాలు మానవ వనరుల కొరతతో ఉన్నాయి. భారత్ యువ శక్తితో సిద్దంగా ఉంది. ప్రపంచంలోని మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుంది. లిచ్టెన్ స్టైన్ వంటి దేశంలో ఏఐ పురోగతి ఆసక్తిగా ఉంది. ప్రకృతి సేద్యంలో ఏపీ దేశంలో అగ్ర స్థానంలో ఉంది.”అని చెప్పారు.
యువతలో నైపుణ్యాలు పెంచుతున్నాం. – మంత్రి నారా లోకేష్
ఈ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ వివిధ అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి విషయంలో ఏపీ తీసుకుంటున్న చర్యలను భారత రాయబారికి మంత్రి నారా లోకేష్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…”స్విట్జర్లాండ్ దేశంలోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి భారత రాయబారి సహకారం అవసరం. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు భారత రాయబారి సహకరించాలి. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అవసరమైన మ్యాన్ పవర్ సిద్దం చేసేందుకు ఏపీ సన్నద్ధంగా ఉంది. యువతకు నైపుణ్యంలో శిక్షణను కల్పిస్తున్నాం. 100 కేజీల బరువు మోసే డ్రోన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఈ రంగంలో బిజినెస్ టు బిజినెస్ పెట్టుబడులను సాకారం చేసేలా సహకరించాలి.”అని చెప్పారు.
అంతకు ముందు జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రికి తెలుగు వారి నుంచి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్యూరిచ్ విమానాశ్రయంలో స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. యూరప్ లోని దాదాపు 20 దేశాల నుంచి తరలి వచ్చిన తెలుగు ప్రజలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐలు, టీడీపీ కార్యకర్తలు వరుసలో నిల్చుని, అభివాదాలు చేస్తూ స్వాగతం తెలియచేశారు. తన కోసం వచ్చిన తెలుగు ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి వారితో ఫోటోలు దిగారు. అంతకుముందు జ్యూరిచ్ విమానాశ్రయంలో సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.





