Local Currency: డాలర్ పతనం ఖాయమిక.. స్థానిక కరెన్సీ ఉపయోగిస్తున్న బ్రిక్స్ దేశాలు…!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) భయపడినంతా జరుగుతోంది. డాలర్ పతనాన్ని అడ్డుకుంటానని, అవసరమైతే బ్రిక్స్ దేశాలపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించినా.. బ్రిక్స్ దేశాలు దాన్ని పట్టించుకోవడం లేదు. స్థానిక కరెన్సీతో కొనుగోళ్లు జరుపుతున్నాయి. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్.. రష్యా కరెన్సీ రూబుల్స్ లో చెల్లింపులు చేస్తోంది. అందులో కొంత భాగం చైనా కరెన్సీ యువాన్ లో చెల్లిస్తోంది. అంటే డాలర్ బదులుగా.. స్థానిక కరెన్సీని .. బ్రిక్స్ దేశాలు వాడుతున్నాయన్నమాట. ఇది ఓరకంగా డాలర్ అధిపత్యానికి గట్టిదెబ్బగా చెప్పొచ్చు.
యుద్ధం తర్వాత వ్యాపార మార్పులు..
2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురు ఎగుమతి మార్కెట్లను ఆసియాలోకి మళ్లించింది. భారత్ ఈ మార్పులో ప్రధాన భాగస్వామిగా ఎదిగింది.సెప్టెంబర్‌లో భారత్ రష్యా నుంచి సుమారు 2.5 బిలియన్ యూరోలు చమురు దిగుమతులకింద చెల్లించింది. ఇది గత నెలతో పోలిస్తే 14% తక్కువ అయినప్పటికీ, మొత్తం విలువ ఇప్పటికీ ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్థాయిలోనే ఉంది.
ఇదిలా ఉంటే యునైటెడ్ కింగ్డమ్ తాజాగా నయారా ఎనర్జీ లిమిటెడ్‌పై ఆర్థిక ఆంక్షలు ప్రకటించింది. ఈ సంస్థలో రష్యన్ మూలధనం ఉన్నందున, పుతిన్ ప్రభుత్వ ఆదాయాన్ని కత్తిరించే ప్రయత్నంగా లండన్ ఈ చర్య చేపట్టింది.ఇది ఇండియన్ ఎనర్జీ సెక్టార్‌పై పరోక్ష ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. ఇదే సమయంలో చైనాలోని ఆయిల్ టర్మినల్స్, ట్యాంకర్లపైనా యూకే ప్రభుత్వం శిక్షాత్మక చర్యలు ప్రారంభించింది.
డాలర్ ఆధిపత్యానికి చెక్..
రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు స్థానిక కరెన్సీలను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తూ గ్లోబల్ డాలరైజేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గం అన్వేషిస్తున్నాయి. యువాన్ వెనుక బీజింగ్ ఆర్థిక మద్దతు, రూబుల్‌కు మాస్కో బ్యాకింగ్, రూపాయికి న్యూ ఢిల్లీ సమీకరణ – ఈ మూడు దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సమతౌల్యం వైపు వ్యూహాత్మకంగా కదులుతున్నాయి.యువాన్‌లో చెల్లింపులు భారత్–రష్యా వాణిజ్యంలో తాత్కాలిక మార్పు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక సమీకరణంలో కొత్త దిశను సూచిస్తోంది. యూకే ఆంక్షలు ఈ మార్పును వేగవంతం చేసే అవకాశముంది.