Ashley J. Tellis: భారత సంతతి రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లిస్ అరెస్ట్

ప్రముఖ విదేశాంగ విధాన నిపుణుడు, భారత సంతతికి చెందిన రక్షణ స్ట్రాటజిస్ట్ ఆష్లే జె.టెల్లిస్ (Ashley J. Tellis)ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. 64 ఏళ్ల టెల్లిస్ తమ దేశ రక్షణ రహస్యాలను అక్రమంగా సేకరించారని, వీటిని అప్పగించేందుకు చైనా అధికారులతో రహస్య సమావేశాలు నిర్వహించారని ఆయనపై యూఎస్ అధికారులు ఆరోపణలు చేశారు. ఎఫ్‌బీఐ (FBI) అఫిడవిట్ ప్రకారం, టెల్లిస్ గత నెలరోజులుగా వైమానిక దళ సాంకేతికతకు సంబంధించిన రహస్య పత్రాల ప్రింట్లను ఒక సహోద్యోగి నుంచి సేకరించారు. ఆయనకు సంబంధించిన ఇళ్లలో చేసిన సోదాల్లో ‘సీక్రెట్’, ‘టాప్ సీక్రెట్’ అని ఉన్న వెయ్యికి పైగా పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెల్లిస్ (Ashley J. Tellis) కొన్నేళ్లుగా కొందరు చైనా (China) అధికారులతో మంతనాలు జరుపుతున్నారని, 2022లో ఆయన బీజింగ్ అధికారులతో విందులో కూడా పాల్గొన్నారని ఎఫ్‌బీఐ (FBI) తెలిపింది. ముంబైలో జన్మించిన టెల్లిస్.. గతంలో ఢిల్లీలోని అమెరికా రాయబారికి సీనియర్ సలహాదారుగా, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ (George Bush) కు జాతీయ భద్రతా మండలిలో సహాయకుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.