Amaravathi: త్వరలో ప్రజల్లోకి సీఎం చంద్రబాబు.. కూటమి పాలనపై ఎంక్వైరీ..!

ఓవైపు కూటమి సర్కార్ పాలనపై గట్టిగా సీఎం చంద్రబాబు (Chandrababu) ఫోకస్ పెడుతున్నారు. గూగుల్ లాంటి అతిపెద్ద టెక్ దిగ్గజాన్ని విశాఖ తీసుకొచ్చారు. మరోవైపు.. పార్టీ పటిష్టతపైనా గట్టిగానే దృష్టిసారిస్తున్నారు. అయితే తాము చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో ఎలాంటి భావన ఉందో తెలుసుకోవడం కోసం.. జిల్లాల బాట పట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీని ప్రకారం నవంబర్ నెల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. రియల్ టైమ్, ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయిపై సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు ముఖ్యమంత్రి.
తాము ప్రజలు మెచ్చే సుపరిపాలన అందిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పాలనలో సుస్థిర విధానాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో అందే లబ్ధి తదితర అంశాలపై ప్రజాభిప్రా య సేకరణ చేపడతామన్న సీఎం.. వాటి గురించి ప్రజలకు తెలిసేలా థియేటర్లలో స్లైడ్‌లు ప్రదర్శించాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు, ఇతర ఉత్పత్తులపై తగ్గిన పన్నుల గురించి గిరిజన ప్రాంతాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ధరల తగ్గుదలపై వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. దీపావళి పండుగ తర్వాత కూడా.. జీఎస్టీ స్పాబ్‌ల తగ్గింపు వల్ల చేకూరే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
సేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..
ప్రభుత్వ శాఖలు అందించే సేవలపై టెక్నాలజీ డేటా ఆడిటింగ్ ద్వారా సంతృప్తి స్థాయిని అంచనా వేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయం, అధికారులు ఇచ్చే సమాచారానికి పొంతన ఉండాలని తేల్చి చెప్పారు. సామాన్యుడికి మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు.. బాధితులకు ఉపశమనం కల్పించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవలని అధికారులకు సూచించారు. ఇక ట్రాఫిక్ చలాన్ల పేరిట సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దని పోలీసులకు చెప్పారు.
అధికారుల పనితీరుపైనా సమీక్ష..!
పథకాలు, ప్రజాభిప్రాయాల గురించే కాకుండా.. అధికారుల పనితీరుపై కూడా సమీక్ష చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వన్ గవర్నమెంట్.. వన్ సిటిజన్ విధానంతో ప్రజలకు సమర్థంగా సేవలు అందిస్తామన్న సీఎం.. దీనిపై నవంబర్ మొదటి వారంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరుపై సమీక్ష చేస్తామని పేర్కొన్నారు.