Jubilee Hills: జూబ్లీహిల్స్ కింగ్ ఎవరో..? గెలుపుకోసం పార్టీల కసరత్తు..!

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక … దేశం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. నవంబర్ 11న జరిగే ఈ ఉపఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా వరుస దెబ్బలతో ఢీలా పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విపక్ష బీఆర్ఎస్.. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటోంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన ఈ ఉపఎన్నికలో ఆయన సతీమణి సునీతను నిలబెట్టి సానుభూతిని ఓటుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. తమకు గ్రేటర్ లో ఉన్న పలుకుబడి, ఎమ్మెల్యేల బలం కలిసి… గెలుపు సునాయాసమని తలుస్తోంది కారు పార్టీ.
అందరికన్నా ముందే అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ముందు ఉంది బీఆర్ఎస్. పార్టీలో కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఆమె తరఫున బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బీఆర్‌ఎస్ ప్రధాన వ్యూహం.. ‘స్థిరత్వం, స్థానిక అభివృద్ధి‘ అనే అంశాలపై ప్రజల్లో నమ్మకం కల్పించడం. అదే సమయంలో నకిలీ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రాజకీయ అజెండాను మలచింది.
కాంగ్రెస్ కొత్త అభ్యర్థి..
కొత్త అభ్యర్థి నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతున్నారు. నియోజకవర్గంలో యువత, బీసీ వర్గాలపై దృష్టి పెట్టిన ఆయనకు… రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ బలమైన మద్దతు అందిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం సులభం.. ‘‘బీఆర్ఎస్ పాలనలో అసమానతలు, అవినీతి, నిరుద్యోగం’’ అనే అంశాలను ప్రజల ముందుంచి స్వరూప మార్పు అవసరమని ప్రజా ప్రచారం చేస్తోంది..
బీజేపీ పాత అభ్యర్థితోనే..
భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, ఈసారి జాతీయ నాయకత్వం మద్దతుతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ‘రెండు పార్టీల దుర్వినియోగం మధ్య నీతివంతమైన పాలన ప్రత్యామ్నాయం‘ అనేఅంశంపై ఆధారపడి ప్రచారం చేస్తున్నారు.త్వరలో కేంద్రమంత్రులను రప్పించి, ప్రచారం హోరెత్తించనున్నారు దీపక్.
స్వతంత్ర అభ్యర్థుల ఎంట్రీ
రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసితులు, నిరుద్యోగులు, బీసీ రిజర్వేషన్ ఉద్యమకారులు కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వీరు ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తారో అన్న భయం ఆయా పార్టీల్లో వ్యక్తమవుతోంది.