ప్రధాని మోదీ పాల్గొన్న సభలో .. అనూహ్య పరిణామం

ప్రధాని మోదీ పాల్గొన్న ఓ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రధాని పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన్ను నిలువరించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బిహార్‌లోని దర్బాంగాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోదీ పాదాలకు నీతీశ్ నమస్కరించేందుకు ప్రయత్నించడం ఈ ఏడాది మూడోసారి కావడం గమనార్హం. జూన్‌లో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధానిని కలిసిన సందర్భంలోనూ మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించి నీతీశ్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతకుముందు లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నవాదాలో నిర్వహించిన ఓ సభలో ప్రధాని పాదాలను తాకారు. బిహార్‌లోని దర్భంగాలో ఎయిమ్స్‌కు శంకుస్థాపనతో పాటు రూ.12 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ నీతీశ్ కుమారపై ప్రశంసలు కురిపించారు. జంగిల్ రాజ్ నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చారని కొనియాడారు.