Modi: పహల్గాం ఉగ్రదాడిపై మోదీ సీరియస్.. ఇంగ్లీషులో ఉగ్రవాదులకు వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ప్రపంచానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) డైరెక్ట్‌గా సందేశం పంపారు. అంతర్జాతీయ ఈవెంట్లలో కూడా హిందీలో ప్రసంగిస్తుండే మోదీ.. ఉగ్రవాదుల విషయంలో తమ విధానాలను ప్రపంచ దేశాలకు నేరుగా, స్పష్టంగా చేరవేయడానికి ఇంగ్లీషును ఉపయోగించుకున్నారు. బిహార్‌లో జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. ‘ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్’ అని ప్రధాని మోదీ (PM Narendra Modi) స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదులందర్నీ భారత్ గుర్తిస్తుంది. వారికి అండగా నిలిచే వారిని కూడా గుర్తించి శిక్షిస్తుంది’ అని మోదీ చెప్పారు. ‘‘ఈ రోజు బిహార్ గడ్డ మీద నుంచి ప్రపంచానికి ఈ విషయం స్పష్టంగా చెప్తున్నా. ఉగ్రవాదులు, వారికి అండగా నిలిచేవారు ఎక్కడున్నా సరే వాళ్లను వదిలిపెట్టం. ఇలా ఉగ్రవాదాన్ని ఉపయోగించుకొని ఎవరూ భారత దేశ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరు. ఉగ్రవాదాన్ని శిక్షించకుండా వదిలిపెట్టబోం. ఈ విషయంలో దేశం మొత్తం ఏకమై, గట్టి సంకల్పంతో ఉంది’’ అని ఇంగ్లీష్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అదే సమయంలో, ఉగ్రదాడి తర్వాత భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని మోదీ (PM Narendra Modi) కృతజ్ఞతలు చెప్పారు. ‘‘మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌లో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు.. పర్యాటకులను వారి మతం ఏంటని అడిగి మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.