‘మహాయుతి కూటమి’కి మోదీ అభినందనలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన 'మహాయుతి కూటమి'కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు. ఐక్యంగా మరిన్న విజయతీరాలను సాధించాలని అభిలషించారు.''ఇది అభివృద్ధి విజయం. సుపరిపాలన సాధించిన గెలుపు. సమష్టిగా ఉంటే మనం మరింత ఎత్తుకు ఎదుగుతాం. ఎన్డీయేకు ఇంత చారిత్రిక విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మహారాష్ట్ర ప్రగతికి అహరహం పాటుపడతామని ప్రజలకు బీజేపీ కూటమి హామీ ఇస్తోంది. జై మహారాష్ట్ర'' అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిర్విరామంగా కృషిచేసిన కార్యకర్తలపట్ల గర్వంగా ఉందన్నారు. వారు ప్రజల మధ్యకు వెళ్లి, అధికార కూటమి సుపరిపాలన గురించి వివరించారన్నారు.