మలేషియాలో ఘనంగా “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” పుస్తకావిష్కరణ
AGM: మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు దాతో కాంతారావు నాయకత్వంలో వార్షిక సమావేశం (AGM) తో పాటు ప్రతిష్ఠాత్మకమైన “ ఎన్టీఆర్ సజీవ చరిత్ర ” పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు (AI in Agriculture) వినియోగంపై ప్రత్యేక సదస్సు కూడా నిర్వహించబడింది.
సజీవ చరిత్రగా..
ఈ కార్యక్రమానికి “ఎన్టీఆర్ సజీవ చరిత్ర” పుస్తకావిష్కరణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన N. T. రామారావు అసాధారణ జీవితం, దూరదృష్టి, చిరస్థాయి వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ గ్రంథం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. సినీరంగం, ప్రజాసేవ, తెలుగు గౌరవం, సామాజిక చైతన్యానికి ఎన్టీఆర్ అందించిన విశిష్ట సేవలను ఈ పుస్తకం సజీవ చరిత్రగా ఆవిష్కరించింది. మలేషియా , ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతో భావోద్వేగపూరిత మైన సందర్భంగా నిలిచింది.

చిరస్మరణీయ వేడుకగా..
ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి విచ్చేసిన ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ , టీడీపీ జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు , ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్ధన్ ముఖ్య అతిథులుగా హాజరై సభకు విశిష్టతను చేకూర్చారు. ఎన్టీఆర్ చరిత్ర, విలువలు, స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని స్మరించుకుంటూ అభిమానులు, సామాజిక నాయకులు, సాంస్కృతిక సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయ వేడుకగా మార్చారు.
పలువురు ప్రముఖులు..
ఫెడరేషన్ అఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తో పాటుగా వారి ప్రతినిధులు రవి వర్మ, శివ, మంగపతి , తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రతినిధులు నాగరాజు , ఇంద్రనీల్ , శైలేంద్ర , పలువురు ప్రముఖులు, గౌరవ అతిథులు కార్యక్రమంలో పాల్గొని MTF చేపడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించారు.

సమాజ విలువలను పెంపొందించడంలో..
భారత్మ లేషియా మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో, తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడంలో, మలేషియా బహుళ సాంస్కృతిక సమాజంలో సమాజ విలువలను పెంపొందించడంలో MTF చేస్తున్న కృషి ని పలువురు నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
“ఎన్టీఆర్ సజీవ చరిత్ర” పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలుగు వారసత్వ పరిరక్షణకు, సాంస్కృతిక ఐక్యతకు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే సమాజ సేవా కార్యక్రమాలకు MTF తన అంకితభావాన్ని మరోసారి చాటిచెప్పింది.






