Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ

పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి (Pahalgam Attack) కేసును జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత భద్రతా దళాలు కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆదేశాల మేరకు, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు (NIA) బదిలీ చేశారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే ఎన్ఐఏ ప్రత్యేక బృందాలు పహల్గాం చేరుకుని విచారణను ప్రారంభించాయి. ఈ దుర్ఘటన (Pahalgam Attack) జరిగిన సమయంలో ఉగ్రవాదులను ప్రత్యక్షంగా చూసిన పర్యాటకులను పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక విభాగంలోని పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పర్యాటకులు ఆ ప్రాంతంలో తీసిన ఫోటోలు, వీడియోలను కూడా వారు జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు. పర్యటన సమయంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ప్రజలను ఎన్ఐఏ (NIA) అధికారులు కోరారు. పహల్గాంలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే అన్ని మార్గాల్లో ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో తనిఖీలు చేపట్టారు.
బైసరన్ ప్రాంతంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు (Pahalgam Attack) సమాచారం అందుకున్న వెంటనే, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ప్రత్యేక క్విక్ యాక్షన్ టీమ్ తక్షణమే స్పందించింది. దాదాపు 25 మంది శిక్షణ పొందిన కమాండోలతో కూడిన ఈ బృందం.. కొండలు, బురద మార్గంలో దాదాపు 40-45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి సంఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే సీఆర్‌పీఎఫ్ (CRPF) యూనిట్ పహల్గాం చుట్టూ అనేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఘటనా స్థలానికి సమీపంలో భద్రతను పటిష్టం చేస్తూ పాయింట్లను నిర్మించింది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని, భయభ్రాంతులకు గురైన పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.