హిందూ-ముస్లిం తేడా చూపిస్తే ఆ అర్హత నాకు లేనట్లే : ప్రధాని మోదీ

తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని, హిందూ-ముస్లిం అంటూ తేడా చూపించిన రోజున ప్రజా జీవితంలో ఉండే అర్హత తనకు ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తాను ఎప్పటికీ మస్లింలకు వ్యతిరేకం కాదని, కావాలని తన మాటలను వక్రీకరించారని అన్నారు. “నేనెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను. సబ్‌కా సాత్-సబ్‌కా వికాస్‌ను నేను బలంగా నమ్ముతాను. పేదల అభివృద్ధి కోసం పాటుపడతాను. అందుకే అధిక సంతానం గురించి మాట్లాడాను. కానీ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. అది చూసి ఆశ్చర్యపోయా. నిజానికి ఎక్కువ మంది పిల్లలను ముస్లింలే కాదు, నిరుపేదలు కూడా కంటారు. కానీ వాళ్లను పెంచడం వాళ్లకు తలకు మించిన ఇబ్బందే కదా. ఏ వర్గం అయినా సరే వారు చూసుకోగలిగినంత సంతానాన్నే కనాలి కానీ, ప్రభుత్వంపై భారం పడేంత కాదు. అదే నేను చెప్పాను” అంటూ మోదీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
అంతేకాకుండా తన చిన్నప్పుడు ముస్లింలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవని, తనకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు కూడా ఉన్నారని అన్నారు. ఈద్ రోజున ముస్లిం స్నేహితులే తనకు అన్నం పెట్టేవారని, తానెప్పుడూ హిందూ-ముస్లిం అంటూ తేడా చూపనని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను అలా చూపిస్తే ఆ రోజున ప్రజా జీవితంలో ఉండే అర్హత తనకు ఉండదని ప్రధాని మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.