సీఎం ఎంపికపై ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యలపై స్పందించిన ఫడ్నవీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా ఎవర్ని ఎంపిక చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. బుధవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం ఎంపిక విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమని, వారి నిర్ణయానికే తమ కూటమి కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ స్పందించారు. మహాయుతి కూటమిలో ఎప్పుడూ ఒకరిపై మరొకరికి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పిన ఫడ్నవీస్.. ఏ విషయంలో అయినా అందరం కలిసి కూర్చొనే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ ఇది వర్తిస్తుందని, కొంతమందిలో కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఈరోజు షిండే వ్యాఖ్యలతో వారికి కూడా పరిస్థితి అర్థమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. త్వరలో పార్టీ అగ్రనేతలను కలిసి సీఎం పదవిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా షిండే కొనసాగుతారు.