NMIA: దేశంలో ఫుల్లీ డిజిటల్ ఎయిర్‌పోర్ట్ ఇదే..! లండన్, న్యూయార్క్ సరసన ముంబై..!

భారత విమానయాన రంగంలో ఒక మైలురాయిగా నిలిచే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (NMIA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. రూ.19,650 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్, భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ (Green Field Airport) గా గుర్తింపు పొందింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం కావడం విశేషం.
ఈ ఎయిర్‌పోర్ట్ డిసెంబర్ నుంచి సర్వీసులు ప్రారంభించనుంది. దీనికి ఎన్నో ప్రత్యేకతలు, అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇది భారతదేశపు తొలి ఫుల్లీ డిజిటల్ విమానాశ్రయం. ఎయిర్‌పోర్ట్ అంతటా రియల్-టైమ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) మానిటరింగ్‌తో కూడిన 5G నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. ప్రయాణికులకు కాంటాక్ట్‌లెస్ ప్రవేశం, భద్రతా తనిఖీ, బోర్డింగ్ సౌకర్యాలు కల్పిస్తూ పూర్తి డిజిటల్ ప్రయాణాన్ని అందిస్తుంది. లగేజీ హ్యాండ్లింగ్ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటెడ్. ప్రయాణికులు తమ సామానును రియల్ టైమ్ లో ట్రాక్ చేయడానికి aviio అనే మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. వేచి ఉండే సమయాన్ని తగ్గించి, ప్రతి దశలో సౌలభ్యాన్ని పెంచేలా డిజిటల్ ఫీచర్లు రూపొందించారు.
నిర్మాణపరంగా కూడా ఈ ఎయిర్ పోర్ట్ కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ విమానాశ్రయాన్ని ముంబైకి దక్షిణాన 37 కి.మీ దూరంలోని ఉల్వేలో 1,160 హెక్టార్లు అంటే సుమారు 2,866 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిని అదానీ (Adani) గ్రూప్, సిడ్కో (CIDCO) పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) కింద నిర్మించాయి. బ్రిటిష్ ఆర్కిటెక్చరల్ సంస్థ జహా హదీద్ ఆర్కిటెక్ట్స్ దీనికి డిజైన్స్ అందించింది. టెర్మినల్ లోటస్ (Lotus) ఆకారాన్ని పోలి ఉంటుంది. భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఉండే ఈ కమలం ఆకారం, 12 శిల్ప స్తంభాలు రేకుల మాదిరిగా, 17 మెగా-స్తంభాలు పైకప్పును మోసేలా దీని నిర్మాణం ఉంటుంది.
మొదటి దశలో ఒక టెర్మినల్, ఒక రన్‌వేతో ఏడాదికి 2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మొదటి టెర్మినల్‌లో 66 చెక్-ఇన్ కౌంటర్లు, 22 సెల్ఫ్-బ్యాగేజ్ డ్రాప్ పాయింట్లు, 29 ఏరోబ్రిడ్జ్‌లు ఉంటాయి. ప్రారంభ దశలో ఏటా 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించగలదు. మొత్తం 5 దశల్లో ఈ విమానాశ్రయం పూర్తి కానుంది. అన్ని దశలు పూర్తయిన తర్వాత విమానాశ్రయం ఏటా 9 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మొత్తం 4 టెర్మినళ్లు అందుబాటులోకి వస్తాయి. ఒకేసారి విమాన కార్యకలాపాలను అనుమతించే రెండు సమాంతర, కోడ్-ఎఫ్ కంప్లైంట్ రన్‌వేలు ఉంటాయి. మొత్తం కార్గో నిర్వహణ సామర్థ్యం 3.25 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుంది.
ఈ విమానాశ్రయం పూర్తిగా ఎకోఫ్రెండ్లీ. సుమారు 47 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి రీసైక్లింగ్ సదుపాయాలు ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా వాటర్ టాక్సీ ద్వారా కనెక్ట్ అయ్యే విమానాశ్రయం ఇదే అవుతుంది. భవిష్యత్తులో ప్రయాణికులను టెర్మినల్స్ మధ్య అనుసంధానం చేయడానికి APM వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సీ పోర్ట్‌కు సమీపంలో ఉండటం వలన, NMIA ఒక ప్రధాన లాజిస్టిక్స్ హబ్ గా కూడా మారనుంది.
నవీ ముంబై విమానాశ్రయం (Navi Mumbai Airport) ప్రారంభంతో, ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA)లో ఏర్పడే రద్దీ తగ్గుతుంది. ముంబై నగరానికి అంతర్జాతీయంగా లండన్, న్యూయార్క్, టోక్యో వంటి జంట-విమానాశ్రయ నగరాల సరసన స్థానం లభించింది. ఈ ప్రాజెక్ట్ ముంబై, పుణె, కొంకణ్ ప్రాంతాలకు వాణిజ్యపరంగా, పర్యాటకానికి మరింత ఊపునిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.