ఈడీ సీజ్ చేసిన సొమ్ముపై మోదీ కీలక వ్యాఖ్యలు..

ప్రజల వద్ద డబ్బు దోచుకొని బ్లాక్ మనీ దాచుకుని అక్రమార్కుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈడీ) అధికారులు వెలికి తీసి స్వాధీన పరుచుకున్న సొమ్ము పై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వాల హయాంలో కొందరు ప్రజలను దోచుకొని అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించి.. వాటిని దాచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఈడీ జరిపిన దాడులలో బయటపడిన ఈ నోట్ల కట్టలు పెద్ద గుట్టలుగా మారాయని చెప్పారు. అయితే ఈ డబ్బంతా పేద ప్రజల కష్టార్జితం అని.. అందుకే వారి సొమ్ముని వారికే తిరిగి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా పేర్కొన్నారు. పేదల డబ్బులు తిరిగి పేదల వద్దకు చేర్చడం కోసం మార్గం వెతుకుతున్నట్లు వివరించారు. ఇందుకోసం అవసరమైతే చట్టాలను మార్చే ఏర్పాట్లు కూడా చేస్తానని మోదీ పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాని ఈ విషయంపై న్యాయ బృందం సలహాని కూడా కోరుతామని వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎన్డీఏ కూటమి దుర్వినియోగం చేస్తోంది అంటూ వస్తున్న ఆరోపణల పై స్పందించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిరుపయోగంగా మారిన ఈడీకి పూర్తి స్వేచ్ఛను అందించిన తమ ప్రభుత్వం కారణంగా ఎంతో బ్లాక్ మనీ బయటకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అని మోదీ వెల్లడించారు.