Modi: కాశ్మీర్ అభివృద్ధి చూడలేకే ఉగ్రదాడి: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పహల్గాం ఉగ్రదాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రతి భారతీయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడని అన్నారు. భారతదేశంలో అనేక మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ, ప్రజలందరూ బాధితులకు అండగా నిలబడటం భారతదేశ గొప్పతనమని కొనియాడారు. జమ్మూ కాశ్మీర్ సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అమాయకులపై ఉగ్రవాదులు దాడి చేశారని ఆయన విచారం వ్యక్తం చేశారు. “జమ్మూ కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకం వృద్ధి చెందుతోంది. ఇది చూసి మన శత్రువులు జీర్ణించుకోలేకపోయారు. కాశ్మీర్‌లో మరోసారి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు” అని మోదీ (PM Narendra Modi) అన్నారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని మోదీ పునరుద్ఘాటించారు.
ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో దేశ ఐక్యత, 140 కోట్ల మంది ప్రజల మద్దతు భారత సైన్యానికి అతిపెద్ద బలమని మోదీ (PM Narendra Modi) పేర్కొన్నారు. మన ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దాడిని భారత ప్రజలు ఏకగ్రీవంగా ఖండించడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయన్నారు. భారతదేశానికి మద్దతు తెలిపిన దేశాలకు మోదీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని వెలికితీస్తామని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి వెన్ను విరుస్తామని హెచ్చరించారు.