మహారాష్ట్రలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పార్టీ తరఫున మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ తరఫున కోమటిరెడ్డి ప్రచారం చేశారు. చేతన్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. అలాగే తమ సర్కారు.. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిందన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగనివ్వడం లేదని, సమస్యలే లేకుండా ధాన్యం కొనుగోళ్లు కూడా చేస్తున్నామని పేర్కొన్నారు.