NCERT: న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర.. ఎన్సీఈఆర్టీ పుస్తకంపై సుప్రీంకోర్టు సంచలన నిషేధం
భారత అత్యున్నత న్యాయస్థానం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనే అర్థం వచ్చేలా ఒక అధ్యాయాన్ని రూపొందించడంపై సుప్రీంకోర్టు గురువారం సుమోటో విచారణ చేపట్టింది. ఈ చర్య న్యాయవ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని, దీని వెనుక ఉన్న శక్తులను వదిలిపెట్టబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది: సీజేఐ భావోద్వేగ వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “ఎన్సీఈఆర్టీ ప్రయోగించిన బుల్లెట్‌తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. కోర్టుల విశిష్ట చరిత్రను, అవి దేశానికి చేసిన సేవలను పక్కన పెట్టి, కేవలం ప్రతికూల అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చడం వెనుక దురుద్దేశం కనిపిస్తోంది. చిన్న వయసులోనే విద్యార్థుల మనసుల్లో న్యాయవ్యవస్థ పట్ల విషాన్ని నింపేలా ఈ పాఠాలు ఉన్నాయి. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు మేము విశ్రమించము” అని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వం బేషరతు క్షమాపణ
కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బేషరతుగా క్షమాపణలు కోరారు. ఈ పాఠ్యాంశాలను తాము ఏమాత్రం సమర్థించడం లేదని, ఇది ఒక పొరపాటుగా జరిగిందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇప్పటికే ఆ పుస్తక పంపిణీని నిలిపివేయాలని విద్యాశాఖ ఆదేశించిందని, వెబ్సైట్ నుండి కూడా ఆ కంటెంట్‌ను తొలగించినట్లు తెలిపారు. పబ్లిక్ నోటీసు ద్వారా కూడా క్షమాపణలు చెబుతామని వెల్లడించారు.
కోర్టు ఆదేశాలు, షోకాజ్ నోటీసులు
వివాదాస్పద పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు తక్షణమే నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడింది.

















