‘‘డామిట్.. కథ అడ్డం తిరిగింది’’.. తమిళనాడులో మళ్లీ ట్విస్ట్
తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అంతా సవ్యంగా జరుగుతోందని, మేజిక్ ఫిగర్ కూడా విజయ్ చేరుకున్నారు. దీంతో విజయ్ ను గవర్నర్ ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. సీపీఐ, సీపీఎంలు తాము గెలుచుకున్న నాలుగు సీట్లకు సంబంధించి, మద్దతిస్తున్నట్లు విజయ్ కి అందజేశారు. సాయంత్రానికి ఐయూఎంఎల్ సైతం మద్దతిస్తున్నట్లే ప్రకటించింది. దీంతో తమకు మద్దతు వుందని విజయ్ గవర్నర్ ని కలిశారు. అంతలోనే ‘మా మద్దతు టీవీకేకి లేదు’’ అంటూ ఐయూఎంఎల్ బాంబు పేల్చింది.
గవర్నర్ ని కలిసే సమయానికి విజయ్ సంఖ్యా బలం 116 కి పడిపోయింది. దీంతో మళ్లీ సందిగ్ధంలోనే పడిపోయారు. అంతా సవ్యంగా సాగి, శనివారం ఉదయం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా ఆశించారు. కానీ కథ అడ్డం తిరిగింది. సరిపడా సంఖ్యా బలం లేనందున గవర్నర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
మరోవైపు శుక్రవారం రాత్రి ఏఎంఎంకే అధినేత టీవీవీ దినకరన్ కూడా గవర్నర్ ని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే బలాన్ని చూపని పక్షంలో, అన్నాడీఎంకేకి అవకాశమివ్వాలని లేఖ అందించారు. తమ ఏకైక ఎమ్మెల్యే పేరుపై టీవీకేకు మద్దతిస్తున్నట్లు నకిలీ లేఖ చక్కర్లు కొడుతోందని, అలాంటి లేఖ తాము ఇవ్వలేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఆచూకీ కూడా తెలియడం లేదని గవర్నర్ కి ఫిర్యాదు చేశారు.






