MIG-21: మిగ్-21 విమానాలకు వీడ్కోలు పలికిన భారత వాయుసేన

భారత వాయుసేనలో (Indian Air Force) ఆరు దశాబ్దాల పాటు సేవలు అందించిన ప్రతిష్టాత్మక మిగ్-21 (MIG-21) యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికారు. చండీగఢ్‌లో భారీ ఫేరెవెల్ కార్యక్రమంలో ఈ విమానాలకు స్వస్తి పలికారు. 1960లలో ఎయిర్‌ఫోర్స్‌లోకి అడుగుపెట్టిన ఈ తొలి సూపర్ సోనిక్ ఫైటర్, ఇంటర్‌సెప్టర్ ఎయిర్‌క్రాఫ్ట్.. వాయుసేన చేపట్టిన ఎన్నో చరిత్రాత్మక మిషన్స్‌లో పాల్గొంది.
చివరి ఫేరెవెల్ సోర్టీ (Farewell Sortie)లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వయంగా పాల్గొని బాదల్ ఫార్మేషన్లో విమానాన్ని నడిపారు. ఆయనతో పాటు, భారతదేశంలో ఏడవ మహిళా ఫైటర్ పైలట్ అయిన ప్రియ శర్మ ఈ స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించడం విశేషం. ల్యాండింగ్ సమయంలో ఈ ఫైటర్ జెట్‌లకు సాంప్రదాయ వాటర్ క్యానన్ సెల్యూట్ అందించారు. అనంతరం మిగ్-21 విమానాల ఫామ్ 700 లాగ్‌బుక్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు (Rajnath Singh) ఎయిర్ చీఫ్ అందజేశారు. దీంతో ఎయిర్‌ఫోర్స్‌లో మిగ్-21 (MIG-21) విమానాల సర్వీసు ముగిసింది.
ఈ సందర్భంగా మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh).. మిగ్-21 (MIG-21) కేవలం విమానం కాదని, భారత్-రష్యా బంధానికి సాక్ష్యం అని కొనియాడారు. 1971 యుద్ధం, కార్గిల్ పోరు, బాలాకోట్ ఎయిర్‌స్ట్రయిక్స్, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక మిషన్స్‌లో ఈ విమానాల పాత్ర చిరస్మరణీయమన్నారు. ఈ వీడ్కోలు ధైర్యం, త్యాగం, అత్యుత్తమ సామర్థ్యాల ప్రస్థానానికి నివాళి అని ఆయన పేర్కొన్నారు. దీంతో భారత రక్షణ రంగంలో (Defense Sector) ఒక శకం ముగిసిందన్నారు.