అమిత్ షా హెలికాప్టర్‌లో ఎన్నికల అధికారుల తనిఖీలు.. అందరూ సహకరించాలన్న కేంద్ర హోంమంత్రి

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. హింగోలీ నియోజకవర్గంలో అమిత్ షా ప్రచారానికి వెళ్లినప్పుడు ఈ పరిణామం చోటుచేసుకుంది. హెలీప్యాడ్ వద్దకు వెళ్లిన అధికారులు.. అమిత్ షా ఉపయోగిస్తున్న హెలికాప్టర్‌లో సోదాలు చేశారు. అక్కడ ఉన్న బ్యాగులు, సూట్ కేసులు, ఇతర వస్తువులను నిశితంగా తనిఖీ చేశారు. ఈసీ నియమావళిని అనుసరించి ఈ తనిఖీలు చేయడం మొత్తాన్ని వీడియో కూడా తీశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అమిత్ షా స్వయంగా వెల్లడించారు. ఎన్నికల సంఘం నియమావళి పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను నిలిపేందుకు ఎన్నికల సంఘానికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను తనిఖీ చెయ్యడంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.