డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక…. అమెరికాకు మంచిదే : జైశంకర్

అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర విదేశాంగమంత్రి జై శంకర్ పేర్కొన్నారు. ఆయన ఎన్నికతో యూఎస్ ఆర్థిక, తయారీ రంగాల్లో మరిన్ని ప్రయోజనాలు పొందుతుందని తెలిపారు. ప్రపంచీకరణ అంశంపై ఓటర్లలో ఉన్న అసంతృప్తి అమెరికా ఎన్నికల్లో కనిపించిందన్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో జైశంకర్ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచీకరణ వల్ల చైనా ఇతర దేశాల కంటే అధికంగా లబ్ధి పొందుతుందని ఆయన అన్నారు. క్లింటన్ పరిపాలనలో మొదట దీనిని అవంలంభించారని పేర్కొన్నారు. అప్పట్లో దీనివల్ల యూఎస్, భారత్ సహా ఇతర దేశాల్లో అనిశ్చితి నెలకొందని వెల్లడించారు. అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశమయినప్పటికీ దానికి ప్రపంచ భాగస్వామ్య దేశాల మద్దతు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ భద్రత గురించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికత, జాతీయ భద్రతను విభజించలేమని, డిజిటల్, ఏఐ విప్లవంలో ఇది భాగమని అన్నారు.