DK Shivakumar: కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు బీజేపీ, జేడీ(ఎస్) కుట్రలు: డీకే శివకుమార్

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించేందుకు బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మండిపడ్డారు. అయితే దీని కోసం ఆ పార్టీలు చేసిన ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రజలు మాకు అందించిన అపూర్వమైన ఆదరణను మేం ఎప్పటికీ మరచిపోలేము. రాష్ట్రంలో మా పరిపాలన అద్భుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. మా ప్రభుత్వం ఇటీవలే 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందరికీ సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవితం అనే లక్ష్యంతో ఈ బడ్జెట్‌ను రూపొందించాం. అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి మేము అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. గతంలో బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలు మహిళలు, యువత, రైతుల అభివృద్ధి కోసం ఏం చేశాయో చెప్పాలి?” అని డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రశ్నించారు. “మా ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చివేయాలని వారు కుట్రలు పన్నుతున్నారు. వాళ్లు ఇంకా ఆ కలల్లోనే జీవిస్తున్నారు. రెండు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మరో నాలుగు పార్టీలు కలిసినా మాకు ఎటువంటి నష్టం లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆశలు నెరవేరవు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుంది” అని డీకే శివకుమార్ (DK Shivakumar) ధీమా వ్యక్తం చేశారు.