కాలుష్య నియంత్రణకు కృత్రిమ వర్షమే దారి.. కేంద్రానికి లేఖ రాసిన ఢిల్లీ మంత్రి

ఢిల్లీలో తీవ్రమైన కాలుష్య పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఈ సమస్యను కట్టడి చేయాలంటే కృత్రిమంగా వర్షం కురిపించడం ఒక్కటే పరిష్కారమని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కృత్రిమ వర్షానికి అనుమతి ఇవ్వడం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ లేఖ రాశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంగళవారం కూడా దేశరాజధానిని పొగమంచు కమ్మేసింది. సగటు ఏక్యూఐ 494గా నమోదు కాగా… ఎనిమిది ప్రాంతాల్లో ఈ సంఖ్య ఏకంగా 500 దాటింది. దీంతో ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీగా అభివర్ణించిన గోపాల్ రాయ్.. దీన్నుంచి విముక్తి కలిగించాలంటే కృత్రిమ వర్షమే పరిష్కారమని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ప్రధాని మోదీ బాధ్యతని, కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృత్రిమ వర్షంపై కేంద్రానికి గత కొన్ని రోజులుగా లేఖలు రాస్తున్నామని, అయినా కేంద్రం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన తన లేఖలో విమర్శించారు. దీనిపై ఇప్పటికైనా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరిన గోపాల్ రాయ్.. లేదంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.