Tahawwur Rana: కుటుంబంతో మాట్లాడాలన్న తహవ్వుర్ రాణా అభ్యర్థనను కొట్టేసిన కోర్టు

2008 ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాకు (Tahawwur Rana) ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంలో చుక్కెదురైంది. తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలన్న అతని అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున నిందితుడి విజ్ఞప్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. రాణా తన కుటుంబంతో మాట్లాడితే కేసులోని ముఖ్యమైన విషయాలు వారికి చెప్పే అవకాశం ఉందని కోర్టుకు ఎన్‌ఐఏ తెలియజేసింది. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు రాణా పిటిషన్‌ను కొట్టివేసింది. తన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు కలత చెందుతున్నారని, వారితో మాట్లాడటం తన ప్రాథమిక హక్కు అంటూ కోర్టులో తహవ్వుర్ రాణా (Tahawwur Rana) పిటిషన్ వేశాడు. దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్‌ఐఏను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఎన్ఐఏ వాదనలు విన్న తర్వాత అతన్ని ఏప్రిల్ 28 వరకు రిమాండ్‌కు పంపుతున్నట్లు కోర్టు వెల్లడించింది. కాగా, తహవ్వుర్ రాణాను ఏప్రిల్ 10వ తేదీన భారత్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.