CM Siddaramaiah: పాక్‌తో యుద్ధం గురించి నేనలా అనలేదు: సిద్ధరామయ్య

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా పాకిస్థాన్ మీడియాలో ఈ వ్యాఖ్యలు విస్తృతంగా ప్రసారం కావడంతో, బీజేపీ వర్గాలు సిద్దరామయ్యపై ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. యుద్ధం వద్దని తాను చెప్పలేదని, అనివార్యమైతేనే జరగాలని, యుద్ధమే సమస్యకు పరిష్కారం కాదని తను చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని కూడా ఆయన (CM Siddaramaiah) ట్వీట్ కూడా చేశారు.
“పాకిస్థాన్‌తో యుద్ధం (War With Pakistan) అవసరం లేదని నేను చెప్పలేదు. సంబంధిత డిమాండ్లను కూడా తిరస్కరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇరు దేశాల మధ్య యుద్ధం జరగాలి. అందుకని యుద్ధమే సమస్యకు పరిష్కారం కాదు. కాశ్మీర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కాబట్టి వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు పుల్వామాలో 40 మంది సైనికులు అమరులయ్యారు. ఈ రెండు ఘటనల్లో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేకపోయింది. అనివార్యమైనప్పుడే యుద్ధం జరగాలి. అస్సలు చేయకూడదని కాదు. కానీ, తక్షణమే యుద్ధం అవసరం లేదు” అని సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) వివరణ ఇచ్చారు.
శనివారం నాడు పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన సిద్ధరామయ్య (CM Siddaramaiah).. “పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదు. మేం దానిని సమర్థించము. శాంతియుత పరిస్థితులు చాలా ముఖ్యం. ప్రజలకు భద్రత అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి” అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ మీడియాలో తెగ ప్రసారం అయ్యాయి. ఆ దేశ మీడియాలో యుద్ధం చేయాలనే విషయంలో భారతదేశంలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉందంటూ ప్రచారం జరిగింది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. శత్రుదేశానికి సిద్ధరామయ్య కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. ఈ క్రమంలో కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ మరో అడుగు ముందుకేసి.. త్వరలోనే పాక్ ప్రభుత్వం సిద్ధరామయ్యకు (CM Siddaramaiah) అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చినా ఆశ్చర్యం లేదంటూ ఎద్దేవా చేశారు.