Chardham Yatra : చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

దేశంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra) ప్రారంభమైంది. అక్షయ తృతీయ నేపథ్యంలో ఉత్తరాఖండ్ (Uttarakhand) ఉత్తర్‌కాశీ జిల్లా గఢ్‌వాల్‌లోని గంగోత్రి(Gangotri), యమునోత్రి (Yamunotri) ఆలయ ద్వారాలను తెరిచారు. సంప్రదాయ పూజల నడుమ ఈ రెండు ఆలయాల తలుపులు వరుసగా ఉదయం 10:30, 11:55 గంటలకు తెరుచుకున్నాయి. కేదార్‌నాథ్ (Kedarnath) , బద్రీనాథ్ (Badrinath) ఆలయాలనూ ఈ నెల 2, 4 తేదీల్లో తెరవనున్నారు. తొలిరోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సందర్శించి పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనమంతా ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. చార్‌ధామ్ యాత్ర మనందరికి గొప్ప పండగ లాంటిది. ఈ యాత్ర కోసం వచ్చే భక్తుల భద్రత మా తొలి ప్రాధాన్యం అని పేర్కొన్నారు.
భక్తుల భద్రత దృష్ట్యా యాత్ర సాగే మార్గాల్లో దాదాపు 6 వేల మంది పోలీసులు, 27 కంపెనీల పీఏసీ, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న 65 ప్రాంతాల్లో ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సైతం వీరికి అదనంగా అందుబాటులో ఉంచారు. చార్‌ధామ్ యాత్రకు దేశ, విదేశాల నుంచి ఇప్పటికే 22 లక్షల మందికి పైగా నమోదు చేసుకోగా, యాత్ర ముగిసే సమయానికి ఈ సంఖ్య 60 లక్షలకు చేరొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.