Pahalgam Attack: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో అత్యంత కీలకమైన సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి (Pahalgam Attack) అనంతరం భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలు, సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) డైరెక్టర్ జనరల్ దిల్జిత్ సింగ్ చౌధరి కూడా నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారు. సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న సమయంలో ఈ వరుస భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత పాకిస్తాన్‌తో ఉన్న దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ చర్యలను జీర్ణించుకోలేని పాకిస్తాన్ నాయకులు భారతదేశంపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. అదే సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ (LoC) వెంబడి దాడులకు తెగబడుతోంది. అయితే భారత సైన్యం ఈ చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పారామిలటరీ, ఆర్మీకి మంజూరు చేసిన సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. సెలవుల్లో ఉన్న వారంతా వెంటనే తిరిగి వచ్చి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది.