Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌కు మద్దతు.. అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో పహల్గాం ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్‌ను ఎవరైనా సమర్థిస్తారా? కానీ అస్సాంకు చెందిన ఒక ఎమ్మెల్యే అదే పనిచేశాడు. ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను ఈ కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం నేరం కింద ఆయనను అరెస్టు చేసినట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. “పహల్గాం దాడిలో (Pahalgam Attack) పాకిస్థాన్ పాత్రను, ఆ దేశ ప్రమేయాన్ని ఎమ్మెల్యే సమర్థిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాను. ఆయనను అరెస్టు చేసినట్లు డీజీపీ చెప్పారు” అని మీడియా సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. సోషల్ మీడియాలో లేదంటే వేరే ఎక్కడైనా సరే పాకిస్థాన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు తెలిపితే ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
అయితే, ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏఐయూడీఎఫ్ పార్టీ స్పష్టం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాము ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపింది. ఇదిలా ఉండగా, ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ ఇప్పటికే కఠినమైన చర్యలు చేపట్టింది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం, అటారీ సరిహద్దును మూసివేయడం, వీసాలను రద్దు చేయడం వంటి చర్యలను అమలు చేసింది. అలాగే ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బందిని కూడా భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.