Pahalgam Attack: ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కఠిన చర్యలు: విపక్షాలకు కేంద్రం హామీ

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను (Pahalgam Attack) నిర్మూలించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల నాయకులకు హామీ ఇచ్చింది. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీని గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. “జమ్మూ కాశ్మీర్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, పర్యాటక రంగం పుంజుకుంటున్న తరుణంలో అక్కడి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయడానికి పహల్గాంలో ఈ ఉగ్రదాడి (Pahalgam Attack) జరిగింది. ఈ దుర్ఘటన అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని పార్టీల నాయకులకు వివరించారు. ఈ ఉగ్రదాడికి దారితీసిన కారణాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోం శాఖ అధికారులు కూడా వివరించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి” అని తెలిపారు.
పార్లమెంట్ ఆవరణలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ ముఖ్యమైన సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు, పహల్గాం ఉగ్రదాడిలో (Pahalgam Attack) మరణించిన వారికి సంతాపం తెలుపుతూ నేతలంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటను పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలోని అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయాలని టీఎంసీ నేతలు కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలు ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వీరందరూ పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam Attack) ముక్తకంఠంతో ఖండించారు.